చిన్నచిన్న తగాదాలకు విడాకులు తగదు
సమాజ శ్రేయస్సు దృష్ట్యా చిన్నచిన్న తగాదాలతో భార్య భర్తలు విడాకులు కోరడం తగదని న్యాయవాది పి. ఏసుబాబు పేర్కొన్నారు. లలిత నగర్ కాలనీ లో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏమైనా భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తే... వాటిని పెద్ద వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి అన్నారు. అలా వీలుకాని పక్షంలో కోర్టులలో ఉండే న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకు వస్తే సామరస్యపూర్వకంగా ఇరువురికి నచ్చజెప్పి తగురీతిలో న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అచట భార్య భర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు పెంపొందడానికి కృషి చేస్తారన్నారు. అంతకు ఇద్దరి మధ్య పరిష్కారం కుదరకపోతే మహిళల తరఫున న్యాయసేవాధికార సంస్థ ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుందని యేసు బాబు తెలిపారు. సంఘ అధ్యక్షులు సుబ్రహ్మణ్య రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాకర్స్ ప్రాంతీయ కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, మురళి ,కే శ్రీ రామ రాజు తదితరులు పాల్గొన్నారు.