త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ను ఐక్య ఉద్యమం కాపాడుకుందాం...
...సిఐటియు విస్తృత సమావేశం పిలుపు...
కాకినాడ, మార్చి 3; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అశేష ప్రజల పోరాటాలతో , 32 మంది ప్రాణ త్యాగం తో సాధించుకున్న విశాఖ ఉక్కు ను నేటి తరం ఐక్య ఉద్యమం లో కాపాడుకోవాలని సిఐటియు కాకినాడ నగర విస్తృత సమావేశం పిలుపు నిచ్చింది.
బుధవారం సాయంత్రం స్థానిక యుటిఎఫ్ టీచర్స్ హోం లో జి. కామశాస్త్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. పోరాటాలు, త్యాగాలతో పాటు 68 గ్రామాల ప్రజలు 22 వేల ఎకరాల భూమిని అందించడం వల్ల విశాఖ ఉక్కు సాకారమైందన్నారు. 68 మంది వామపక్షాల ఎమ్మెల్యే లు, ఎంపీలు రాజీనామా లు చేసి పోరాడిన చరిత్ర ఉందన్నారు. సుమారు 2.5 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు పరిశ్రమ ను కొరియా కు చెందిన పోక్సో అనే కంపెనీ కి కారుచౌకగా కట్టబెట్టడానికి కేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ఇప్పటికే చాలా అన్యాయం చేసారని పేర్కొన్నారు. తాజాగా దేశంలో నవరత్న హోదా కలిగి, లక్షా యాభై వేల మంది కి ప్రత్యక్షం గా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ను దెబ్బకొడితే చూస్తూ ఊరుకోమన్నారు. దేశరాజధాని లో జరుగుతున్న రైతుల పోరాటం మోడీ దూకుడు కు కళ్ళెం వేసిందన్నారు. ఆ ఉద్యమ స్ఫూర్తి తో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ఉద్యమం గా సాగాలన్నారు. ఈ ఉద్యమం లో సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ముందు వరుసలో నిలబడాలన్నారు. ప్రజలంతా ఈ ఉద్యమానికి అండగా నిలవాలని, మార్చి 5 రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలని పిలుపు ఇచ్చారు.
సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ మార్చి 14 న జరుగబోతున్న తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాబ్జీ షేక్ గారిని గెలిపించుకోవడానికి కృషి చేద్దామన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీ, జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రమళ్ళ పద్మ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకట రమణ లతో పాటు సి.వెంకట్రావు, సిహెచ్. విజయ్ కుమార్, ఎం. రమణమ్మ, పద్మ, పాప, భారతి, తుపాకుల వీర్రాజు, గాంధీ, అర్జున్, నవీన్, బంగారు రామకృష్ణ, బండి గోపి, వర్రే రమణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు...
No comments:
Post a Comment
Please post your valuable comments